నటినటులు: తంబి రామయ్య, సముద్రికని.

దర్శకుడు : సముద్రికని

నిర్మాణం : అభిరామి మీడియా వర్క్స్

సముద్రికని అద్భుతమైన దర్శకుడు. తెలుగులో వచ్చిన శంభో శివ శంభో దానికి ఒరిజినల్ అయిన నాడొడిగల్ చూస్తే అతని దర్శకత్వ ప్రతిభ అర్థం అవుతుంది. నటుడిగా మారిన తర్వాత దర్శకత్వానికి కాస్త దూరమైన మాట నిజమే కానీ ఈమధ్య వినోదయ సిత్తం అనే చిత్రం ద్వారా మళ్ళీ తన సత్తా చూపాడు. కధలోనికి వెళితే…

కథ: కథ చెన్నైలో జరుగుతూ ఉంటుంది. పరుశురాం ఒక కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పని చేస్తూ ఉంటాడు. ఎప్పటికైనా ఆ కంపెనీకి తానే జనరల్ మేనేజర్ అవుతానని కలలుగంటూ ఉంటాడు. తన మాటే నెగ్గాలనే తత్వం కలిగిన వాడు. ఇంట్లో బాగా స్ట్రిక్ట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. భార్య పిల్లలు తను చెప్పినట్టే నడుచుకోవాలనుకుంటాడు. పరశురామ్ కి ముగ్గురు పిల్లలు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కొడుకు అమెరికాలో ఉంటాడు. ప్రతి దానికి టైం లేదు టైం లేదని కుటుంబ సభ్యులకు కూడా సరిగా టైం కేటాయించడు. కంపెనీ పని మీద కోయంబత్తూరు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో యాక్సిడెంట్ అయి చనిపోతాడు. సరిగ్గా అప్పుడే అతని ఆత్మను తీసుకెళ్లడానికి ఒక మనిషి వస్తాడు తానే ఈ టైం అని చెప్తాడు. కానీ పరశురాం రావడానికి ఒప్పుకోడు, చాలా రకాలుగా అతని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు ఈ లోకంలో తను లేకపోతే ఎన్నో పనులు ఆగిపోతాయని, తన కుటుంబాన్ని అంత సెటిల్ చేయాలని కొంత సమయం కావాలని అడుగుతాడు. దానికి టైం 90 రోజులు గడివిస్తాడు. కానీ ఆ 90 రోజులు తను పరశురామ్ తోనే ఉంటానని చెప్తాడు. ఈ డీల్ కి పరుశురాం ఒప్పుకుంటాడు. ఆ ప్రమాదంలో నుంచి బయటపడ్డాను అని చెప్పి ఇంటికి చేరుకుంటాడు. కానీ చావు నుండి బయటికి వచ్చాక పరుశురాంకి పరిస్థితులన్నీ మారిపోతాయి. తన కంపెనీలో తానే జిఎం అవుతాను అనుకుంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి అప్పాయింట్ చేస్తారు. కోపంలో ఉద్యోగం మానేస్తానంటాడు. సరిగ్గా అదే టైంలో తన భార్య అనారోగ్యం ముదిరి హాస్పటల్ పాలవుతుంది, కొడుకు ఉద్యోగం పోతుంది, తన కూతుర్లు తన మాట జవదాటరు అని అనుకుంటే పెద్దకూతురు వేరే అతని ప్రేమించి అతనితో పాటు వెళ్లి పోతుంది. ఒక్కసారిగా తన కట్టుకున్న సామ్రాజ్యం కూల్పోయినట్టు ఫీల్ అవుతాడు. వీటి నుంచి పరుశురాం ఎలా బయటపడ్డాడు, తన కుటుంబాన్ని ఎలా సెటిల్ చేశాడు, తన 90 రోజులు గడువు పూర్తయిన తర్వాత టైం తో పాటు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు “వినోదయ సిత్తం” సినిమా చూడాలి.

విశ్లేషణ: సింపుల్ గా చెప్పుకోవాలి అంటే ఇది మన కధె, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు అనే విషయం తెలుసుకోకపోతే మన చుట్టూ ఒక అడ్డుగోడ కట్టుకొని అంతా మనక నచ్చినట్టే జరుగుతుంది అనుకుంటామ్. కానీ మన వెనకాల ఎన్నో జరుగుతాయి మనం ఉన్న లేకపోయినా ఈ లోకం నడుస్తూనే ఉంటుంది. ఇదే విషయాన్ని చాలా సింపుల్ గా హాస్య భరితంగా సముద్రికని తన చిత్రంలో చెప్పారు. ఈ సినిమాలో తంబి రామయ్య ది మెయిన్ క్యారెక్టర్. కాస్త కామిక్ టచ్ తో కూడిన పాత్ర ఆయన అద్భుతంగా చేశారు. అలాగే సముద్రికని కూడా ఒక మంచి పాత్రలో కనిపించారు. వీలుంటే తప్పకుండా ఈ చిత్రాన్ని చూడండి. జీ5 లో తెలుగులో కూడా ఉంది.